హైదరాబాద్: తెలంగాణలో రేషన్ కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ-కేవైసీ (e-KYC) ప్రక్రియ పూర్తి చేయడానికి నిర్ణయించిన గడువు శుక్రవారంతో ముగియాల్సి ఉండగా, లబ్ధిదారుల సౌకర్యార్థం దానిని ఆగస్టు 31 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. అదే సమయంలో రేపటి నుంచి మూడు నెలలకు సంబంధించిన రేషన్‌ను ఒకేసారి పంపిణీ చేయనున్నట్లు కూడా స్పష్టం చేసింది.
రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ఈ-కేవైసీ ప్రక్రియలో ఇంకా పలువురు లబ్ధిదారులు నమోదు పూర్తి చేయలేకపోయారు. ముఖ్యంగా భారీ వర్షాల ప్రభావంతో పాటు, ప్రస్తుతం కొనసాగుతున్న ‘సర్’ (SIR) ప్రక్రియ కారణంగా చాలా ప్రాంతాల్లో ప్రజలు రేషన్ దుకాణాలకు వెళ్లలేకపోయారని ప్రభుత్వం గుర్తించింది. ఈ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని గడువు పెంచినట్లు అధికారులు తెలిపారు.
మొదట ఈ వెసులుబాటును గ్రేటర్ హైదరాబాద్ (GHMC) పరిధికే పరిమితం చేయాలని భావించినప్పటికీ, జిల్లాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల నేపథ్యంలో నిర్ణయాన్ని మార్చి రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు వర్తింపజేశారు. దీంతో గ్రామీణ, పట్టణ ప్రాంతాలన్నింటిలోని రేషన్ కార్డుదారులు అదనపు గడువు ప్రయోజనాన్ని పొందనున్నారు.
ఇక లబ్ధిదారుల్లో నెలకొన్న మరో సందేహానికి కూడా ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. e-KYC పూర్తి కాలేదనే కారణంతో రేషన్ నిలిపివేయబోమని, రేపటి నుంచి మూడు నెలలకు సంబంధించిన రేషన్‌ను ఒకేసారి పంపిణీ చేస్తామని ప్రకటించింది. దీంతో ఇంకా ఈ-కేవైసీ పూర్తి చేయని కుటుంబాలు కూడా అర్హత మేరకు రేషన్ పొందే అవకాశం ఉంటుంది.
అయితే అధికారులు ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం రేషన్ పంపిణీపై ఎలాంటి ఇబ్బంది లేకపోయినా, ఆగస్టు 31లోపు ప్రతి లబ్ధిదారుడు తప్పనిసరిగా e-KYC పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నారు. సమీప రేషన్ దుకాణంలో బయోమెట్రిక్ ధృవీకరణ ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చని తెలిపారు.
ఇది కూడా చదవండి: ఇందిరమ్మ ఇళ్లపై సోషల్ మీడియాలో వదంతులు.. కీలక ప్రకటన చేసిన హౌసింగ్ బోర్డు VC గౌతమ్.
రాష్ట్రంలో లక్షలాది కుటుంబాలు ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) ద్వారా అందే రేషన్‌పై ఆధారపడుతున్న నేపథ్యంలో, ప్రభుత్వం తీసుకున్న ఈ తాజా నిర్ణయం వారికి తక్షణ ఉపశమనాన్ని కలిగించనుంది. ముఖ్యంగా వర్షాల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని అధికారులు భావిస్తున్నారు.






