Home / Telangana / Indiramma Towers: ఆగస్టు 10తో దరఖాస్తులకు ముగింపు.. ఇందిరమ్మ టవర్స్‌పై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

Indiramma Towers: ఆగస్టు 10తో దరఖాస్తులకు ముగింపు.. ఇందిరమ్మ టవర్స్‌పై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

Indiramma Towers

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్లు పథకం (Indiramma Towers) అమలులో విషయంలో కీలక ముందడుగు వేసింది. తొలి విడత గృహ నిర్మాణ సంబంధిత పనులను ఆగస్టు చివరి వారంలో వారం ప్రారంభం చేస్తున్నట్టు రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార & పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలియజేయడం జరిగింది. టెండర్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని, అది పూర్తికాగానే నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. శుక్రవారం సచివాలయంలో జరిగిన మీడియాతో మంత్రి మాట్లాడుతూ, హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ (CUR/HYD) పరిధిలో లక్ష ఇళ్ల నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. తొలి దశలో 16 నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి 500 చొప్పున మొత్తం 8,000 ఇళ్ల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. అదనంగా మరో నాలుగు నియోజకవర్గాల్లో కూడా స్థలాల గుర్తింపు పూర్తయిందని, దశలవారీగా లక్ష ఇళ్ల నిర్మాణాన్ని విస్తరించనున్నట్లు వెల్లడించారు.

పేద కుటుంబాలకు హైదరాబాద్ వంటి అభివృద్ధి చెందిన నగరంలో గౌరవప్రదమైన నివాసం కల్పించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని మంత్రి తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంపై కొందరు దుష్ప్రచారం చేసినప్పటికీ ప్రజలు వాటిని నమ్మలేదని, ప్రస్తుతం పెద్ద సంఖ్యలో వస్తున్న దరఖాస్తులే ఇందిరమ్మ టవర్స్‌పై ప్రజల విశ్వాసానికి నిదర్శనమని పేర్కొన్నారు. ప్రభుత్వ భూములపై నిర్మించే ఈ టవర్స్‌లో ఎంపికైన ప్రతి లబ్ధిదారునికి 20 నుంచి 22 గజాల అన్‌డివైడెడ్ షేర్ (Undivided Share) ఉచితంగా వారి పేరుపై రిజిస్ట్రేషన్ చేస్తామని మంత్రి వెల్లడించారు. భూమి విలువతో కలిపి ఒక్కో ఫ్లాట్ మార్కెట్ విలువ సుమారు రూ.40 లక్షల నుంచి రూ.60 లక్షల వరకు ఉండే అవకాశం ఉందని తెలిపారు. ఫలక్‌నుమా ప్యాలెస్ సమీపంలో కూడా ఇందిరమ్మ టవర్స్ నిర్మాణం చేపట్టనున్నట్లు చెప్పారు.

లబ్ధిదారుల జీవనోపాధికి ఇబ్బందులు తలెత్తకుండా నియోజకవర్గాన్ని యూనిట్‌గా తీసుకుని ఇళ్ల కేటాయింపు, నిర్మాణం చేపడుతున్నామని మంత్రి వివరించారు. అందువల్ల దరఖాస్తుదారులు తాము నివసిస్తున్న లేదా అర్హత కలిగిన నియోజకవర్గంలోనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తుదారుల నివాస ధృవీకరణ విషయంలో కూడా ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఆధార్ కార్డు ఒక్కటే తప్పనిసరి కాదని, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, బ్యాంక్ పాస్‌బుక్ వంటి ఇతర చెల్లుబాటు అయ్యే పత్రాలను కూడా నివాస ధృవీకరణ కోసం సమర్పించవచ్చని మంత్రి తెలిపారు. దీంతో ప్రజలు అనవసర ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

Indiramma Towers దరఖాస్తుల గడువుపై మంత్రి మరోసారి స్పష్టమైన ప్రకటన చేశారు. ఆగస్టు 10తో దరఖాస్తుల స్వీకరణ ముగుస్తుందని, గడువును పొడిగించే ఆలోచన ప్రభుత్వానికి లేదని పేర్కొన్నారు. అర్హులైన వారు చివరి తేదీ కోసం వేచి చూడకుండా ముందుగానే దరఖాస్తు పూర్తి చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు సమయంలో చెల్లించే రూ.10,000 ఈఎండీ (EMD) గురించి కూడా ఎలాంటి అపోహలు అవసరం లేదని మంత్రి స్పష్టం చేశారు. అర్హత లభించని వారికి చెల్లించిన మొత్తాన్ని 100 శాతం తిరిగి చెల్లిస్తామని తెలిపారు. యూపీఐ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించిన వారికి అదే బ్యాంక్ ఖాతాలోకి రీఫండ్ నేరుగా జమ అవుతుందని వెల్లడించారు.

ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పారదర్శకత, బాధ్యతతో ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ సమన్వయం చేస్తూ సామాన్య ప్రజలకు దీర్ఘకాల ప్రయోజనం చేకూరేలా ఇందిరమ్మ టవర్స్ పథకాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని ఆయన పేర్కొన్నారు.

Tagged:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *